‘నోటా’ ఓట్లు 50 శాతం దాటితే మాత్రం.. మాజీ సీఈసీ ఏమన్నారంటే.. | nota-could-be-effective-only-if-more-than-50-pc-voters-opt-for-it-ex-cec-op-rawat
icon icon icon
icon icon icon

‘నోటా’ ఓట్లు 50 శాతం దాటితే మాత్రం..! మాజీ సీఈసీ ఏమన్నారంటే..

ఇందౌర్‌ స్థానంలో ‘నోటా’కు ఓటేయాలంటూ కాంగ్రెస్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే, ఎన్నికల ఫలితాలపై ‘నోటా’ ప్రభావం నామమాత్రమేనని మాజీ సీఈసీ ఓపీ రావత్‌ తెలిపారు.

Published : 12 May 2024 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నోటా (NOTA)’కు ఓటేయాలంటూ మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో కాంగ్రెస్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోన్న విషయం తెలిసిందే. తమ అభ్యర్థి చివరి క్షణంలో నామినేషన్‌ ఉపసంహరించుకుని, భాజపాలో చేరిపోవడంతో.. హస్తం పార్టీ పోటీలో లేకుండా పోయింది. దీంతో పోటీలో ఉన్న వారెవరికీ మద్దతు ప్రకటించకుండా.. ‘నోటా’ మాటెత్తుకుంది. అయితే, ఎన్నికల ఫలితాలపై ‘నోటా’ ప్రభావం నామమాత్రమేనని మాజీ సీఈసీ ఓపీ రావత్‌ తెలిపారు. ఒకవేళ దీనికి 50 శాతానికిపైగా ఓట్లు వస్తే మాత్రం.. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం పడేలా చర్యలు తీసుకోవడంపై ఆలోచించాల్సి ఉంటుందన్నారు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ‘నోటా’కు నామమాత్రపు ప్రాముఖ్యమే ఉంది. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపదు. ఒక స్థానంలో 100 ఓట్లలో నోటాకు 99, అభ్యర్థికి ఒక ఓటు వచ్చినా.. అభ్యర్థే విజేతగా నిలుస్తారు. ఒకవేళ నోటాకు 50 శాతానికిపైగా ఓట్లు వస్తే.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను తాము అర్హులుగా పరిగణించడం లేదని ఓటర్లు చాటుతున్నట్లే. దీంతో పార్లమెంటు, ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నికల ఫలితాలపై ఈ ఓట్లను ప్రభావితం చేయడానికి చట్టాలను మార్చడం గురించి వారు ఆలోచించాల్సి ఉంటుంది’’ అని ఓపీ రావత్‌ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇందౌర్‌లో 5045 ఈ ఓట్లు నమోదయ్యాయి.

‘నోటా’ కోసం కాంగ్రెస్‌ విస్తృత ప్రచారం.. ఇందౌర్‌లో విచిత్ర పరిస్థితి!

భారత్‌లో 2013 వరకు అభ్యర్థులు నచ్చకున్నా, సరైనవారు పోటీలో లేరని భావించినా.. ఎవరికో ఒకరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉండేది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి.. 2013లో ‘నోటా’ను ప్రవేశపెట్టారు. ఆ ఏడాది దిల్లీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా దీనిని అమలు చేశారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో దీనికి సగటున రెండు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఏకంగా 51,660 మంది దీనికి ఓటేశారు. పోలైన మొత్తం ఓట్లలో ఇవి ఐదు శాతంతో సమానం.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img